లేడీ డాక్టర్ హత్య

కడపలో దారుణ ఘటన చోటుచేసుకుంది. లేడీ డాక్టర్‌ని కట్టుకున్న భర్తే అతి కిరాతకంగా హత్య చేసిన అమానుష ఘటన వెలుగుచూసింది. నగరంలోని ఓ శాంతినగర్ 14 లైనులో ఈ ఘటన జరిగింది. చిన్నచౌకు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శ్రీకాళహస్తికి చెందిన దాసు లక్షుమయ్యకి ఖాజీపేటకి చెందిన వెంకట అన్నపూర్ణమ్మతో 20 ఏళ్ల కిందట వివాహమైంది. ఇద్దరూ హోమియోపతి వైద్యులు కావడంతో కడపలో క్లినిక్ ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్నారు.

వారి కుమార్తె నవ్యప్రణతి(18) జార్జియాలో ఎంబీబీఎస్ చదువుతూ నిమోనియాతో మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని ఇండియాకి రప్పించేందుకు దంపతులు 5 లక్షల రూపాయల వరకూ అప్పు చేసినట్లు తెలుస్తోంది. ఆ బాకీలు తీర్చే విషయమై కొద్దికాలంగా భార్యాభర్తల నడుమ గొడవలు జరుగుతున్నాయి. బంగారం అమ్మేసి అప్పులు తీరుద్దామని ఒత్తిడి చేస్తున్నాడని అన్నపూర్ణమ్మ తన తల్లికి చెప్పుకుని బాధపడేది. అదే విషయమై మరోమారు గొడవ జరగడంతో ఆవేశానికి లోనైన భర్త ఇనుప రాడ్డుతో తలపై బలంగా కొట్టాడు.

ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోవడంతో హైడ్రామాకు తెరతీశాడు. వెంటనే నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. మూర్చలు రావడంతో ఆస్పత్రికి తీసుకొచ్చానని బావమరిది భార్యకి ఫోన్ చేసి చెప్పాడు. విషయం తెలుసుకున్న అత్త రమణమ్మ, ఆమె కుటుంబ సభ్యులు ఆస్పత్రికి వచ్చి విగతజీవిగా పడి ఉన్న కూతురిని చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అయితే డాక్టర్ లక్షుమయ్యకి మరో మహిళతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె వద్దే ఉంటూ భార్యని నిర్లక్ష్యం చేయడంతో ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. దానికి తోడు కూతురి కోసం చేసిన అప్పుల విషయమై తలెత్తిన వివాదం ముదిరి హత్యకు దారితీసి ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసు విచారణలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.