కదులుతున్న బస్సులో…

న్యూఢిల్లీ : కదులుతున్న బస్సులో మహిళను వేధించిన ఘటన మరోసారి దేశ రాజధానిలో వెలుగుచూసింది. ఈసారి బాధితురాలు ఏకంగా పోలీస్‌ కానిస్టుబుల్‌ కావడం గమనార్హం. చేతులతో ఇష్టమొచ్చినట్లు తాకడమే కాకుండా దాడికి కూడా పాల్పడినట్లు తన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొన్నది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటనకు సంబంధించి బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.పోలీస్‌ కంట్రోల్‌ రూంకు అటాచ్‌గా ఉన్న ఓ 29 ఏండ్ల మహిళా కానిస్టేబుల్‌ బుధవారం మధ్యాహ్నం విధులకు వెళ్లేందుకు బస్సెక్కింది. ఆమెతో పాటు బస్సెక్కిన కొందరు అకతాయిలు.. నేరుగా ఆమె దగ్గరికెళ్లి నిలుచున్నారు. అందులోని ఓ యువకుడు తన చేతులతో ఆమెను తాకుతూ వేధించడం ప్రారంభించాడు. వారి వెకిలి చేష్టలను గమనించిన మహిళా కానిస్టేబుల్‌ కాస్తా ముందుకు వెళ్లి నిలుచున్నది. అయినప్పటికీ వారు ఆమెను అనుసరించి ఆమె వెనకాలే నిలుచున్నారు. దాంతో ఆ వ్యక్తిపై గట్టిగా అరిచిన మహిళ.. మరోసారి అలాతాకితే పోలీసులకు కంప్లైంట్‌ ఇస్తానని బెదిరించింది. దాంతో సదరు యువకుడు ఆగ్రహానికి గురై తన చేతిలోని హెల్మెట్‌తో అందరూ చూస్తుండగానే దాడికి పాల్పడ్డాడు. దాంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. బస్సులో ఉన్నప్రయాణికులు ఎవరూ అడ్డుకోకుండా మిన్నకుండిపోయారు. దాంతో సదరు మహిళా కానిస్టేబుల్‌ ఫిర్యాదు మేరకు నిందితుడిపై లైంగికవేధింపుల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం గాయపడిన మహిళా కానిస్టేబుల్‌ దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ దవాఖానలో చికిత్స పొందుతున్నది.