కత్తిని మింగిన వ్యక్తి

కంట్లో నలుసు పడితేనే కొద్ది క్షణాల పాటు ఉక్కిరి బిక్కిరి అవుతాం. అలాంటిది గొంతులో ఓ కత్తి దిగితే ఎలా ఉంటుంది? ఊహించుకోవడానికే కష్టంగా అనిపిస్తోంది కదూ! కానీ మధ్యప్రదేశ్‌లో అచ్చంగా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఛత్తర్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి పద్నాలుగు సెంటిమీటర్ల పొడవున్న కత్తిని గుటుక్కుమని మింగేశాడు. దాన్ని మింగేటప్పుడు ఎక్కడా గుచ్చుకోలేదు కానీ, తిన్నగా ఆహారనాళంలోకి ప్రవేశించాక మొదలైంది అసలు సమస్య.

గుటక వేస్తే చాలు కత్తి కొన త్రిశూలంలా గొంతును పొడుస్తోంది. ఈ బాధను తాళలేకపోయిన సదరు వ్యక్తిని భోపాల్‌లోని ఎయిమ్స్‌లో చేర్పించారు. అక్కడి వైద్యులు జనవరి 26న అత్యవసర శస్త్రచికిత్స చేసి ఆహార నాళంలో ఉండిపోయిన కత్తిని తీసివేశారు. ఈ విషయాన్ని వైద్యులు మంగళవారం మీడియాకు వెల్లడించారు. అయితే అతడు ఇలా ఏది పడితే దాన్ని గుటకాయ స్వాహా అనిపించడం కొత్తేమీ కాదు. రెండేళ్ల క్రితం కూడా అతడు పలు వస్తువులను మింగేయగా ఎయిమ్స్‌ వైద్యులు వాటిని పొట్టలో నుంచి బయటకు తీశారు.