హత్యలు చేసి..రోడ్డు ప్రమాదాలుగా చిత్రీకరించి…చివరికి పోలీసులకు చిక్కి…

నల్లగొండ : ఈజీ మ‌నీ కోసం హ‌త్య‌లు చేసి వాటిని రోడ్డు ప్ర‌మాదాలుగా చిత్రీక‌రించి బీమా క్లెయిమ్స్ చేసుకుంటున్న ముఠా గుట్టును న‌ల్ల‌గొండ జిల్లా పోలీసులు బ‌హిర్గ‌త ప‌రిచారు. జిల్లాలోని దామరచర్ల మండ‌ల‌ కేంద్రంగా బీమా పాలసీల క్లెయిమ్స్ కోసం హత్యలు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల‌ను మంగ‌ళ‌వారం మీడియా ఎదుట హాజ‌రుప‌రిచారు. డీఐజీ ఏ.వి.రంగ‌నాథ్ వివ‌రాల‌ను వెల్ల‌డిస్తూ.. కేసులో ప్ర‌ధాన నిందితుడు ధీరావ‌త్ రాజు అని తెలిపారు. ఇత‌నితో పాటు వేముల కొండ‌ల్‌, కంచి శివ‌, మందాడి సాయి సంప‌త్‌, దేవిరెడ్డి హారికను అరెస్టు చేసి రిమాండ్‌కు త‌ర‌లించిన‌ట్లు వెల్ల‌డించారు. ‌ మొత్తం ఆరు కేసులకుగాను రూ. 3 కోట్ల 39 లక్షల 40 వేల విలువ గ‌ల‌ బీమా పాల‌సీలు తీసుకున్నారు. వీటిలో ఇప్ప‌టికే ఒక‌ కోటి 59 లక్షల 40 వేలను  క్లెయిమ్ చేయ‌గా మ‌రో కోటి 80 లక్షలకు క్లెయిమ్స్ చేసుకునే ప‌నిలో ముఠా ఉంద‌న్నారు. అక్రమ సంబంధాలు, అనారోగ్య స‌మ‌స్య‌లు, తాగుడుకు బానిసలైన వారిని ల‌క్ష్యంగా చేసుకుని ముఠా స‌భ్యులు బీమా పాలసీలు చేయించారు. భార్య, కుటుంబ సభ్యులు, అక్రమ సంబంధం కలిగిన వ్యక్తుల సహకారంతో హత్యలు చేసి బీమా సొమ్ములను క్లెయిమ్స్ చేసి పంచుకుంటున్నారు. ఇన్సూరెన్స్ చేయించిన అనంతరం బాధితులను హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తున్నారు. ముఠా స‌భ్యులు ఇప్పటివరకు ఐదు హత్యలకు పాల్ప‌డ్డ‌ట్లుగా స‌మాచారం. ఈజీ మనీ కోసమే అక్రమ మార్గాన్ని ఎంచుకున్న ముఠా స‌భ్యులు క్లెయిమ్స్ చెల్లింపులలో ఇన్సూరెన్స్ అధికారులు, బ్యాంక్ ఉద్యోగులను మేనేజ్ చేసి కోట్ల రూపాయలు దండుకున్నారు.