బాలికపై అత్యాచారం చేసిన ఇన్‌స్పెక్టర్

కంటికి రెప్పలా కాపాడాల్సిన కుటుంబ సభ్యులు.. న్యాయం చేయాల్సిన పోలీసులే ఆ చిన్నారిని చిదిమేశారు. అభం శుభం తెలియని చిన్నారిని లైంగికంగా దోచుకున్నారు. బలవంతంగా వ్యభిచార కూపంలోకి దించి నరకం చూపించారు. కంచే చేను మేసిందన్న చందంగా ఓ సీనియర్ ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారి బాలికపై అత్యాచారం చేశాడు. ఈ అత్యంత అమానుష ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగింది.

వాషర్‌మెన్‌పేటకి చెందిన బాలిక(13) అయినవాళ్ల చేతిలో మోసపోయింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన వారే సంతలో పశువులా అమ్మేశారు. ఆమె తనువుతో వ్యాపారం చేశారు. బలవంతంగా వ్యభిచారంలోకి దించి నరకం చూపించారు. ఆటలాడుకోవాల్సి వయస్సులో వరుస అత్యాచారానికి గురైన బాధితురాలికి న్యాయం చేయాల్సిన పోలీసు అధికారే ఆమెపై కన్నేశాడు. పదమూడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేశాడు.

ఆలస్యంగా వెలుగుకి వచ్చిన ఈ ఘటన తమిళనాడులో సంచలనంగా మారింది. ఈ ఘటనపై చెన్నై పోలీస్ కమిషనర్‌ సీరియస్‌గా స్పందించారు. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇన్‌స్పెక్టర్ పుగజ్జెంతిని విధుల నుంచి సస్పెండ్ చేశారు. ఇన్‌స్పెక్టర్ సహా ఎనిమింది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమె పేరెంట్స్.. బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడిన మరో ఐదుగురిని కూడా అరెస్టు చేసి కటకటాలవెనక్కి నెట్టారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.