సూర్యాపేట : సూర్యాపేట జిల్లాలోని జాజిరెడ్డిగూడెం వద్ద గురువారం మధ్యాహ్నం ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. పెళ్లి బృందంతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 17 మంది తీవ్రంగా గాయపడగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సూర్యాపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ వీరయ్య మద్యం సేవించి వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. మద్యం మత్తులో అతివేగంగా నడపడం వల్లే వాహనం బోల్తా కొట్టిందని పేర్కొన్నారు. బాధితులంతా అర్వపల్లి మండలం బొల్లంపల్లి వాసులుగా పోలీసులు గుర్తించారు. వీరంతా ఊట్కూర్‌కు పెళ్లికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
