భార్య, కుమార్తెను కాపాడుకున్న భర్త

కళ్ల ముందే చిరుతపులి దాడి చేసి భార్యా పిల్లలను చంపబోతుంటే.. ఎవరైనా చూస్తూ ఊరుకుంటారా? కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి కూడా అలాగే చూస్తూ ఊరుకోలేదు. చిరుతపై ఎదురుదాడికి దిగాడు. వీరోచితంగా పోరాడాడు. చేతిలో ఎలాంటి ఆయుధం కూడా లేదు. ఖాళీ చేతులతోనే చిరుతను మట్టి కరిపించాడు.

భార్య, కుమార్తెను కాపాడుకున్నాడు. కానీ, చిరుతపులి ఒక్కసారిగా మీదకి దూకి పంజా విసరడంతో భార్య బిడ్డలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. కర్ణాటకలోని హసన్‌ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

కర్ణాటకలోని హసన్‌ జిల్లా హరిసెక్రె తాలుకాకు చెందిన రాజగోపాల్ నాయక్ తన భార్య, కుమార్తెతో కలిసి బైక్‌పై బయల్దేరాడు. ఆయన బైక్ బెండాక్రె ప్రాంతానికి చేరుకోగానే అటవీ ప్రాంతం నుంచి అకస్మాత్తుగా వచ్చిన ఓ చిరుతపులి ఒక్కసారిగా మీదకి దూకింది. దీంతో వారు ముగ్గురూ బైకు మీద నుంచి కిందపడిపోయారు.

రాజగోపాల్ తేరుకునేలోపే చిరుతపులి వారిపై దాడి చేసింది. భార్య, కుమార్తెను చంపబోయింది. అది గమనించిన రాజగోపాల్‌ ఒక్కసారిగా ఆ క్రూరమృగంపైకి దూకాడు. దాంతో వీరోచితంగా పోరాడి చంపేశాడు. చివరికి దాన్ని హతమార్చి తమ ప్రాణాలను రక్షించుకున్నాడు.