భోజనం వండలేదని భార్యను చంపిన కసాయి భర్త

హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. భోజనం వండలేదన్న కోపంతో భార్యను అమానుషంగా అంతమొందించాడో కసాయి భర్త. ఈ దారుణ ఘటన మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మీర్‌పేట ఏరియాలని ప్రశాంతి నగర్‌లో శ్రీనివాసరెడ్డి, తన భార్య జయమ్మ(40), కొడుకుతో కలసి నివాసముంటున్నాడు. భార్య జయమ్మ కొడుకుతో కలసి వివాహానికి వెళ్లి వచ్చిన సమయంలో ఇంటికొచ్చిన భర్త శ్రీనివాసరెడ్డి భోజనం వండమని చెప్పాడు.

అందుకు భార్య నిరాకరించడంతో ఆగ్రహంతో రగిలిపోయాడు. చీరతో భార్య గొంతుబిగించి అమానుషంగా చంపేశాడు. భార్య ప్రాణాలు కోల్పోవడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పాట్‌కి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు శ్రీనివాసరెడ్డి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.