అనుమానంతో భార్యను చంపేసిన భర్త

తన జల్సాలకు అడిగినంత డబ్బు ఇవ్వలేదన్న కారణంతోపాటు.. అనుమానం పెంచుకున్న ఓ శాడిస్టు కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా చంపేసిన ఘటన వైఎస్సార్‌ జిల్లా బద్వేలు పట్టణం సుందరయ్య కాలనీలో సంచలనం సృష్టించింది. పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు.. జిల్లాలోని జమ్మలమడుగు పట్టణం వెంకటేశ్వరకాలనీకి చెందిన మంజుల (23)కు నాగరాజు అనే వ్యక్తితో గతంలో వివాహం జరిపించారు.

అయితే మనస్పర్థలతో నెల రోజుల్లోనే వారు విడిపోయారు. అనంతరం మంజుల జీవనోపాధి నిమిత్తం కువైట్‌కు వెళ్లి 8 నెలల క్రితం జమ్మలమడుగులోని అమ్మగారింటికి వచ్చింది. ఈ సమయంలో కడప తిలక్‌నగర్‌కు చెందిన దూరపు బంధువు మన్నూరుహరి మంజులను ప్రేమించానని, ఆమెతో వివాహం జరిపించాలని పట్టుబట్టి గతేడాది నవంబర్‌లో వివాహం చేసుకున్నాడు.

కడపలో కాపురముంటూ పెయింటింగ్‌ పని చేసుకునే హరి మద్యానికి బానిసవ్వడంతో పాటు అనుమానంతో మంజులను వేధించసాగాడు. ఇందుకు హరి తల్లి లక్ష్మి కూడా సహకరిస్తుండేది. అనుమానం ఓ వైపు.. డబ్బులు ఇవ్వడం లేదన్న కోపం మరో వైపుతో మంజులను ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితమే కాపురాన్ని బద్వేలులోని సుందరయ్యకాలనీలోకి మార్చాడు.

శుక్రవారం రాత్రి భార్యతో గొడవకు దిగిన హరి శనివారం తెల్లవారుజామున 1 గంట సమయంలో ఆమెను అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి చంపేశాడు. ఆపై తాను కూడా ఎడమవైపు చాతీపై చిన్నపాటి గాయమయ్యేలా పొడుచుకుని ఆత్మహత్య నాటకానికి తెరలేపాడు. అంతటితో ఆగక భార్య మృతదేహం పక్కనే పడుకుని సెల్ఫీ తీసుకుని కుటుంబ సభ్యులకు, మిత్రులకు పంపించాడు. తెల్లవారుజామున విషయం బయటకు పొక్కడంతో పోలీసులు వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి రామలక్షుమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.