ఆర్థిక స్థోమత లేక ఓ భర్త దారుణం

అనారోగ్యంతో బాధపడుతున్న భార్యకు చికిత్స చేయించే ఆర్థిక స్థోమత లేక ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. ఆమెను దారుణంగా హత్య చేసి జైలు పాలయ్యాడు. ఈ సంఘటన శనివారం రాత్రి మహారాష్ట్రలోని పర్భణి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పర్భిణి జిల్లా ముద్గల్‌ గ్రామానికి చెందిన 45 ఏళ్ల వ్యక్తి భార్య గత కొన్ని సంవత్సరాలుగా బ్రేయిన్‌ టూమర్‌తో బాధపడుతోంది. నిరుద్యోగి అయిన అతడు ఆమె ఖర్చుల నిమిత్తం విపరీతంగా శ్రమించేవాడు.

ఈ నేపథ్యంలో అనారోగ్యంతో ఉన్న భార్యకు కడుపునిండా సరైన తిండి పెట్టలేని పరిస్థితి వచ్చింది. దీంతో ఆమెను చంపాలని నిశ్చయించకున్నాడు.శనివారం రాత్రి పదునైన ఆయుధంతో ఆమెను చంపేశాడు. అనంతరం ఇంటి బయటకొచ్చి రక్తంతో తడిసిన బట్టల్ని దగ్గరలో పడేసి వెళ్లిపోయాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు దుస్తుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఆదివారం నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.