భార్యను హతమార్చి భర్త ఆత్మహత్య

జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్యను పాశవికంగా హతమార్చిన ఓ వ్యక్తి ఆపై తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు.. తల్లాడ మండలం రంగం బంజర్‌కు చెందిన సంక్రాంతి సుబ్రహ్మణ్యేశ్వర రావు(65), విజయలక్ష్మి(60) దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఒక కుమార్తె ఫారిన్‌లో ఉండగా.. మరొకరు రామగుండంలో ఉద్యోగం చేస్తున్నారు. అయితే సుబ్రహ్మణ్యేశ్వర రావు, విజయలక్ష్మి మాత్రం సొంత ఊరిలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో సుబ్రహ్మణ్యేశ్వర రావు విజయలక్ష్మిని కత్తితో నరికి చంపేశాడు.

అనంతరం తాను సైతం పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కాగా భార్యాభర్తల అలికిడి లేకపోవడంతో ఇరుగుపొరుగు వచ్చి చూడగా దంపతులు విగతజీవులుగా కనిపించారు. విజయలక్ష్మి రక్తపు మడుగులో పడి ఉండగా, సుబ్రహ్మణ్యేశ్వర రావు ఆమె మృతదేహంతో పక్కనే అచేతనంగా పడి ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు కుటుంబ కలహాలే కారణమా లేదా ఇంకా ఇతర కారణాలేమైనా ఉన్నాయా అన్న కోణంలో విచారిస్తున్నారు. కాగా సుబ్రహ్మణ్యేశ్వర రావు చర్యతో గ్రామమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కూతుళ్లు ఇద్దరూ ప్రయోజకులై జీవితాల్లో స్థిరపడ్డారని, కానీ ఇప్పుడు వారు తల్లిదండ్రులు లేని వారయ్యారంటూ విచారం వ్యక్తం చేస్తున్నారు.