భార్యపై ఆగ్రహంతో రగిలిపోయిన భర్త

ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తను వదిలేసి సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అతనితో ఉంటూ భర్తతో తెగదెంపులు చేసుకోవాలని భావించింది. ఈలోపే ఆమెకు మృత్యువు ముంచుకొచ్చింది. ప్రియుడితో కలసి ఉంటున్న భార్యపై ఆగ్రహంతో రగిలిపోయిన భర్త దారుణానికి ఒడిగట్టాడు. నడిరోడ్డుపై అమానుషంగా నరికి చంపేశాడు. ఈ దారుణ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది.

గణపవరం మండలం చిలకంపాడుకి చెందిన చంటి, అదే మండలంలోని మొయ్యేరుకు చెందిన చంద్రిక(24) ఆరేళ్ల కిందట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొద్దికాలం సాఫీగానే సాగిన కాపురంలో కలహాలు రేగాయి. అదే సమయంలో చంద్రికకి సోషల్ మీడియాలో ఉంగుటూరు మండలం గొల్లగూడెంకి చెందిన జెర్సీతో పరిచయమైంది. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్తతో తెగదెంపులు చేసుకోవాలని భావించిన చంద్రిక నాలుగు నెలలుగా ప్రియుడు జెర్సీతో కలసి ఉంటోంది.

భార్య తనను దూరం పెట్టి ప్రియుడితో ఉండడం చంటికి ఆగ్రహం తెప్పించింది. ఆమెను హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. బైక్‌పై ప్రియుడితో కలసి పెంటపాడు వైపు వస్తున్న విషయం తెలుసుకున్న చంటి మరో ఇద్దరితో కలసి దారికాచాడు. బైక్ ఆపి ప్రియుడు జెర్సీతో గొడవపడ్డాడు. అతను తప్పించుకుని పారిపోగా భార్యను కత్తితో మెడపై నరికి కిరాతకంగా చంపేశాడు. పారిపోయిన జెర్సీ పోలీసులకు సమాచారం అందించడంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.