భార్యను కత్తెరతో పొడిచి చంపిన భర్త

కట్టుకున్న భార్యను కత్తెరతో పాశవికంగా పొడిచి హతమార్చాడు ఓ ప్రబుద్ధుడు. భార్యను అతి కిరాతకంగా చంపడమే కాకుండా మృతదేహాన్ని పక్కనే పెట్టుకొని మొబైల్‌లో వీడియో గేమ్‌‌ ఆడటం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ దారుణ ఘటన రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో ​చోటు చేసుకుంది. వివరాలు.. విక్రమ్‌ సింగ్‌(35) అనే వ్యక్తి, భార్య శివ కన్వర్‌ (30)తో కలసి బీజేస్‌ కాలనీలో నివాసం ఉంటున్నాడు. విక్రమ్‌కు ఏ ఉద్యోగం లేకపోవడంతో భార్యతో తరుచుగా గొడవలు జరుగుతుండేవి.

ఈ క్రమంలో ఆదివారం రాత్రి భార్యభర్తల మధ్య చిన్న గొడవ మొదలై అది కాస్తా తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. దీంతో కోపం పట్టలేని విక్రమ్‌ సింగ్‌ ఇంట్లోని కత్తెరతో భార్యను పదే పదే పొడుస్తూ హత మార్చాడు. అనంతరం పోలీసులు, అత్త మామలకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకునే సరికి భార్య రక్తపు మడుగుల్లో పడి ఉండగా.. మృతదేహం పక్కనే నిందితుడు వీడియో గేమ్‌ అడుతూ కనిపించాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ దంపతులకు ఇద్దరూ పిల్లలు ఉన్నట్లు, సంఘటన జరిగిన సమయంలో వారు ఇంట్లో లేరని సీనియర్‌ పోలీస్‌ అధికారి కైలస్‌దాన్‌ వెల్లడించారు.