భార్యను దారుణంగా హత్య చేసిన భర్త

కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను దారుణంగా హత్య చేసిన ఓ భర్త ఆమె శవాన్ని రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. ఈ భయానక ఘటన రాజస్తాన్‌లోని కోటలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాజస్తాన్‌, కోటలోని భాతపద ఏరియాకు చెందిన పింటు అలియాస్‌ సునీల్‌ వాల్మీకి అదే ప్రాంతానికి చెందిన సీమతో 15 సంవత్సరాల క్రితం వివాహామైంది.

వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్దబ్బాయికి తొమ్మిది సంవత్సరాలు, చిన్నబ్బాయికి 9నెలలు. గత కొన్ని సంవత్సరాలుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం కూడా ఇద్దరికీ గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఆగ్రహానికి గురైన సునీల్‌ గొడ్డలితో ఆమెను నరికి చంపాడు.

అనంతరం భార్య శవాన్ని రోడ్డుపై బరబరా ఈడ్చుకెళ్లాడు. దాదాపు 70-80 మీటర్లు లాక్కెళ్లాడు. ఇళ్లల్లోని జనం బయటకు వచ్చి ఈ దృశ్యాలను చూడటంతో.. భయపడిపోయిన సునీల్‌ శవాన్ని అక్కడే వదిలేశాడు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీమ శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. సునీల్‌ దాడిలో గాయపడ్డ చిన్న కుమారుడ్ని ఆసుపత్రిలో చేర్పించారు. ఆ చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించాడు.