ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వాసుపత్రిలో దారుణం

ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వాసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. యువతి మృతదేహాన్ని ఓ వీధి కుక్క కొరుక్కుతినేందుకు ప్రయత్నించింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీంతో అధికారుల నిర్లక్ష్యంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వివరాలు.. రోడ్డు ప్రమాదానికి గురైన ఓ యువతిని సంభాల్‌ జిల్లా ఆస్పత్రిలో చేర్పించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ క్రమంలో బాధితురాలి మృతదేహంపై తెల్లని వస్త్రం కప్పి ఆస్పత్రి ప్రాంగణంలో స్ట్రెచర్‌పై పడుకోబెట్టారు. అయితే అక్కడే తచ్చాడుతున్న ఓ వీధి కుక్క శవాన్ని కొరుక్కుతినేందుకు ప్రయత్నించింది.

ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొంతమంది కెమెరాలో బంధించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కాగా ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ కూతురు మరణించిందని మృతురాలి తండ్రి చరణ్‌ సింగ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. గంటన్నరపాటు ఒక్క వైద్యుడు కూడా అందుబాటులోకి రాలేదని, ఆలస్యం కావడంతో తన కుమార్తె ప్రాణాలు కోల్పోయిందని ఆరోపించారు. వీధికుక్కలు లోపలికి వచ్చినా సిబ్బంది పట్టించుకోవడం లేదని, వారి నిర్లక్ష్యం వల్ల ఇంకెంత మంది ఇబ్బందులు ఎదుర్కోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక ఈ ఘటనపై స్పందించిన చీఫ్‌ మెడికల్‌ సూపరిండిండెంట్‌.. ఆస్పత్రిలో వీధి కుక్కల సంచారం గురించి స్థానిక అధికారులకు సమాచారమిచ్చామని, అయినా వారు స్పందించలేదని పేర్కొన్నారు. యువతి మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించామని, ఇందులో తమ తప్పేమీ లేదని సమర్థించుకున్నారు. అయితే విచారణ అనంతరం స్వీపర్‌, వార్డ్‌బాయ్‌ నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని, వారిద్దరిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

అయితే ఆస్పత్రిలో అధిక సంఖ్యలో మృతదేహాలు ఉన్న కారణంగానే వారు అందుబాటులో లేకుండా పోయారని, పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు. కాగా ఈ ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేసింది. దీంతో యోగి సర్కారు పనితీరుపై సోషల్‌ మీడియాలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.