ముంబైలో దారుణ సంఘటన

ముంబైలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ప్రేమించిన మహిళపై పెట్రోల్‌ పోసి హత్యకు యత్నించిన వ్యక్తి మంటల్లో గాయపడి మరణించగా.. బాధిత మహిళ పరిస్థితి విషయంగా ఉన్న సంఘటన శనివారం జరిగింది. దీనిపై బాధిత మహిళ సోదరుడు మేఘవాడి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు చనిపోయిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన ఆశ్చర్యకరమైన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ప్రస్తుతం పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేపట్టారు. పోలీసుల సమచారం మేరకు… జోగేశ్వరిలోని గాంధీనగర్‌ ప్రాంతానికి చెందిన విజయ్‌ ఖంబేకు అదే ప్రాంతానికి చెందిన మహిళతో రెండున్నర ఏళ్లుగా పరియం ఉంది. ఈ క్రమంలో అతడు ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు.

ఇదే విషయాన్ని బాధిత మహిళ కుటుంబ సభ్యులకు చెప్పాడు. అయితే పెళ్లిక సదరు మహిళ కుటుంబ సభ్యులు తిరస్కరించడంతో విజయ్‌ ఆమెను వేధించడం మొదలు పెట్టాడు. ఈ నేపథ్యంలో శనివారం(ఫిబ్రవరి 6) ఇంట్లో ఎవరూ లేని సమయంలో విజయ్‌ ఆమె ఇంటికి వెళ్లి సదరు మహిళపై వెనక నుంచి పెట్రోల్‌ పోసీ నిప్పంటించాడు. దీంతో సదరు మహిళ విజయ్‌ని గట్టిగా పట్టుకోవడంతో అతడికి కూడా మంటలు అంటుకున్నాయి. విజయ్‌ గట్టిగా అరవడంతో చూట్టుపక్కల వారు వచ్చి వారిద్దరూ మంట్లల్లో కాలుతూ కనిపించారు.

వెంటనే మంటలు ఆర్పి స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో విజయ్‌కి తీవ్ర గాయాలు కావడంతో అతడు మృతి చెందగా.. బాధిత మహిళ పరిస్థితి విషయంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. దీనిపై మేఘవాడి సీనియర్‌ పోలీసు అధికారి మాట్లాడుతూ.. బాధిత మహిళ సోదరుడి ఫిర్యాదు మేరకు మృతుడు విజయ్‌పై కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ కేసులో మరిన్ని విషయాలు వెల్లడి కావాల్సి ఉందని, ప్రస్తుతం విచారణ జరుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.