అడవిలో ఘొరం

హత్యకు గురైన ఓ‌ బాలుడి శవాన్ని అడవి జంతువులు పీక్కుతిన్న ఘటన ఢిల్లీలో ఆలస‍్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దక్షిణ ఢిల్లీలోని ప్రజాపతి మోహల్లా గ్రామానికి చెందిన 17 ఏళ్ల మైనర్‌ అతడి మిత్రుడికి 2500 రూపాయలు అప్పుగా ఇచ్చాడు. అయితే స్నేహితుడు ఎంతకీ అప్పు తీర్చకపోవటంతో మైనర్‌కు విపరీతమైన కోపం వచ్చింది. నవంబర్‌ నెలలో అప్పు విషయమై ఇద్దరి మధ్య గొడవ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో మైనర్‌ అతడి మిత్రుడ్ని బండరాయితో కొట్టి చంపాడు.

అనంతరం శవాన్ని దగ్గరలోని మైదాన్‌గర్హి అడవిలో పడేశాడు. నిందితుడు హత్య విషయాన్ని తండ్రికి చెప్పటంతో ఆయన పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు అడవిలోకి వెళ్లి చూడగా మృతుడి శవం కనిపించింది. శవం అరచేతులు, తల భాగాల్ని కొద్దిగా అడవి జంతువులు పీక్కుతిన్నాయి. మృతుడి తల్లిదండ్రులు బట్టలు, శరీరంపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా కుమారుడ్ని గుర్తించారు. పోలీసులు ఇందుకు సంబంధించిన వివరాలను బుధవారం మీడియాకు వెల్లడించారు.