మైనర్‌ బాలికపై హోం గార్డు లైంగికదాడి

మాయమాటలతో మభ్యపెట్టి ఓ మైనర్‌ బాలికపై హోం గార్డు లైంగికదాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు పోలీసులు నిందితుడిపై పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంఘటన తుకారాంగేట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అడ్డగుట్టలోని కమ్యూనిటీహాలు ప్రాంతానికి చెందిన మల్లికార్జున్‌ (40) హోంగార్డు. హైద్రాబాద్‌ సీసీఎస్‌లో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.

అయితే ఇటీవల అదే ప్రాంతానికి చెందిన మైనర్‌ బాలికతో పరిచయం ఏర్పడింది. మాయమాటలతో బాలికను మభ్యపెట్టి మోసం చేశాడు. బాలిక ఇంట్లో ఎవరూలేని సమయం చూసి అత్యాచారం చేశాడు. ఇంట్లో ఎవరికీ చెప్పొద్దని ఆమెను భయపెట్టాడు. కాగా, బాలికకు రెండు రోజులుగా ఆరోగ్యం సరిగా ఉండకపోవడంతో తల్లిదండ్రులు ప్రశ్నించగా జరిగిన విషయం చెప్పింది. బాధితులు స్థానిక తుకారాంగేట్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మల్లికార్జున్‌పై పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.