హైదరాబాద్: హర్యానాలోని రోహతక్‌లో ఓ తండ్రి పరువు హత్యకు పాల్పడ్డాడు. కోర్టుకు వెళ్లి ప్రేమ పెళ్లి చేసుకోవాలని భావించిన జంటపై ఆ తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. తండ్రి జరిపిన ఫైరింగ్‌లో కూతురు అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. ఈ ఘటనలో ఆ అమ్మాయి లవర్ గాయపడ్డాడు. ఇద్దరూ జాట్ కులానికి చెందినవారే. కానీ వేరు వేరు గ్రామాల్లో నివసిస్తున్న ఆ జంట ప్రేమ పెళ్లి చేసుకోవాలని భావించింది. వారి ప్రేమ వివాహాన్ని అమ్మాయి తండ్రి నిరాకరించాడు. పెళ్లి కూతురు పూజా తండ్రి కాల్పుల్లో వెంటనే ప్రాణాలు కోల్పోయింది. పెళ్లి కుమారుడు మోహిత్‌కు తీవ్ర గాయాలు కావడంతో అతన్ని హాస్పిటల్లో చేర్చారు. అతని పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నది. మోహిత్ సోదరుడిపైన కూడా అమ్మాయి తండ్రి కాల్పులు జరిపాడు. రోహతక్ ఢిల్లీ బైపాస్ రోడ్డు మీద ఉండే ఓ బిజీ మార్కెట్‌లో ఈ కాల్పుల ఘటన జరిగింది. మోహిత్, పూజాల వివాహాన్ని జరిపించేందుకు వారి వారి కుటుంబాలతో కోర్టుకు వెళ్తున్న సమయంలో హత్యా ఘటన చోటుచేసుకున్నది. నిజానికి పూజా తండ్రి తొలుత కూతురి వివాహాన్ని వ్యతిరేకించారని, ఆ తర్వాత ఒప్పుకున్నట్లు మోహిత్ తల్లి చెప్పింది. కానీ కోర్టుకు వెళ్లే సమయంలో పూజా తండ్రి దారుణానికి పాల్పడినట్లు ఆమె ఆరోపించారు. కారులోనే పూజా ప్రాణాలు విడిచింది. ఈ ఘటన తర్వాత ఆమె తండ్రి పారిపోయాడు.