బావ వేదింపులు తాళలేక యువతి ఆత్మహత్యాయత్నం

బెంగళూర్‌ : తనను పెండ్లి చేసుకోవాలని బావ నిత్యం వేధిస్తుండటంతో కలత చెందిన మహిళ పురుగుమందు తాగి తనువు చాలించేందుకు ప్రయత్నించిన ఘటన బెంగళూర్‌లో వెలుగుచూసింది. కేజీహళ్లి ప్రాంతంలో నివసించే తన భార్య చెల్లెలు ఆశపై శివాజీనగర్‌కు చెందిన వినోద్‌ కుమార్‌ కన్నేశాడు. కాస్మెటీషియన్‌గా పనిచేసే ఆమెను తనకిచ్చి పెండ్లి చేయాలని భార్యను మరో పెండ్లి చేసుకోవాలని నిందితుడు ఒత్తిడి చేసేవాడు. 2015లో మరదలు విడాకులు పొందినప్పటి నుంచి కుమార్‌ ఆమె వెంటపడి వేధింపులకు గురిచేస్తున్నాడు. ఇద్దరు పిల్లలు కలిగిన కుమార్‌ మరదలిపై మోజుపడటం పట్ల కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపారు.

ఆశకు ఇటీవల ఓ పెండ్లి ప్రతిపాదన వచ్చిందని తెలుసుకున్న కుమార్‌ ఆమెతో వాగ్వాదానికి దిగాడు. ఆశ మొబైల్‌ ఫోన్‌తో పాటు రూ 5000 తీసుకుని వేధింపులకు గురిచేశాడు. కుటుంబ సభ్యుల ద్వారా ఆశ తన ఫోన్‌ను తిరిగి తెప్పించుకోగా మరోసారి కుమార్‌ ఫోన్‌ చేసి ఆమెను బెదిరించాడు. బావ వేధింపులతో వేసారిన ఆమె పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించారు. కుటుంబసభ్యులు దవాఖానకు తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్య కేంద్రంలో ఆమె స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. నిందితుడు కుమార్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.