నిద్రమాత్రలిచ్చి బంగారం అపహరణం

బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో పరిచయం అయిన మహిళ ఇంటికి వెళ్లిన ఓ వ్యక్తి ఆమెకు నిద్రమాత్రలిచ్చి బంగారు ఆభరణాలతో ఉడాయించాడు. సనత్‌నగర్‌ పోలీసులు తెలిపిన మేరకు.. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మహిళ (36) ఎర్రగడ్డలో నివాసముంటోంది. గతంలో ఆమెకు బస్సులో ఓవ్యక్తి పరిచయమయ్యాడు.ఈ క్రమంలో ఇద్దరు తరచుగా ఫోన్‌లో మాట్లాడుకునే వారు.

ఈ నెల 22న మహిళ ఇంటికి వచ్చి ఆమెతో కొద్దిసేపు ముచ్చటించాడు. తర్వాత విటమిన్‌ ట్యాబ్లెట్‌ అని నమ్మించి నిద్రమాత్రలు ఇచ్చాడు. మాత్రలు వేసుకున్న కొద్దిసేపటికే ఆమె మత్తులోకి జారుకుంది. అదే అదనుగా ఇంట్లో ఉండే రెండు తులాల బంగారు ఆభరణాలను తీసుకుని ఉడాయించాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.