ప్రాణం తీసిన ఫేస్‌బుక్‌ ప్రేమ

ఫేస్‌బుక్‌ ప్రేమ ఓ యువతి ప్రాణం మీదకు వచ్చింది. ప్రేమికుడు పెళ్లికి నిరాకరించి, మరొకరితో పెళ్లికి సిద్ధపడ్డాడని ఆమె మనస్తాపం చెందింది. జీవితంపై విరక్తితో ఆత్మహతాయ్యత్నానికి పాల్పడింది. మదనపల్లె మండలంలో సోమవారం ఈ సంఘటన జరిగింది. రూరల్‌ ఎస్‌ఐ దిలీప్‌కుమార్, బాధితురాలి కథనం మేరకు మండలంలోని ఓ రైతు కుమార్తె (20)కు మదనపల్లెలోని ఓ ప్రైవేట్‌ కళాశాలలో ఇంటర్‌ చదివే సమయంలో అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన వినోద్‌కుమార్‌తో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఏడాదిగా చాటింగ్‌ చేసుకుంటూ ప్రేమించుకున్నారు. కొంతకాలం సహజీవనం సాగించారు. పెళ్లి చేసుకుందామనుకున్న సమయంలో ఇద్దరి కుటుంబ సభ్యులకు సమాచారం తెలిసింది.

అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయిని హెచ్చరించారు. అతని ఫోన్‌ నంబర్‌ బ్లాక్‌ చేశారు. దీంతో ఆ యువకుడు మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. అదే సమయంలో యువతికి తల్లిదండ్రులు దగ్గరి బంధువుతో పెళ్లి కుదిర్చారు. ఇష్టంలేని పెళ్లి చేసుకోలేక ప్రియుడికి ఫోన్‌ చేసింది. అతడు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నట్లు చెప్పాడు. దీంతో మనోవేదనకు గురైన ఆ యువతి సోమవారం పురుగుమందు తాగింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు ప్రథమ చికిత్స చేశారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్‌ చేశారు. రూరల్‌ ఎస్‌ఐ దిలీప్‌కుమార్‌ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.