స్నేహితుడు దూరం కావడంతో ఆత్మహత్య

స్నేహం కోసం కొందరు ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం అంటారు. ఇలాంటి డైలాగ్స్ మనం సినిమాల్లో ఎక్కువగా వింటూ ఉంటాం. అయితే నిజంగా ఓ అమ్మాయి తన స్నేహం కోసం ప్రాణాల్ని అయినా వదిలేద్దామనుకుంది. తన ఫ్రెండ్ సరిగా మాట్లాడటం లేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్నేహితుడు దూరం కావడంతో ఆత్మహత్యకు యత్నించింది. కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేర్ డ్యామ్ వద్ద సెల్పీ తీసుకుంటు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. దీంతో లేక్ పోలీసులు గుర్తించి ఆమెను కాపాడారు. కొత్తపల్లి గ్రామానికి చెందిన యువతి ఓ ప్రైవేట్ సంస్థలో పని చేస్తుండగా అక్కడే పని చేసే యువకుడితో సన్నిహితంగా మెదిలి మంచి మిత్రులు గా మారారు.

అయితే ఆ యువకుడు ఇటీవల ఆమెతో మాట్లాడకుండా దూరంగా ఉండడంతో ఆ ఎడబాటును తట్టుకోలేకపోయింది. స్నేహితుడికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తలేదు. దీంతో స్పందన లేకపోవడంతో మంచి మిత్రుడు దూరమయ్యాడనే మనస్థాపంతో డ్యాం వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. డ్యాం వద్ద లేక్ పోలీసులు ఆ యువతిని గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. మంచి మిత్రుడు దూరం అయ్యాడనే బాధతో ఆత్మహత్యకు యత్నించినట్లు యువతి తెలిపింది. తనకు ఏ సమస్య లేదని, మిత్రుడు దూరమై తనతో మాట్లాడ లేకపోవడంతోనే ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు చెప్పారు.