ప్రియుడిని చంపేసిన ప్రియురాలు

మోస్రా అటవీ ప్రాంతంలో చింతకుంట గ్రామానికి చెందిన గూండ్ల పెద్ద దత్తు(30) అనే యువకుడు హత్యకు గురయ్యాడు. దత్తుతో సహజీవనం చేస్తున్న ప్రియురాలే హత్య చేసినట్లుగా మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతకుంట చెందిన దత్తుకు పదేళ్ల క్రితం రామాయంపేట్‌కు చెందిన దివ్యతో వివాహం జరిగింది.

వీరికి కుమారుడు జన్మించిన తర్వాత మూడేళ్లకే కుటుంబంలో కలహాలు రావడంతో దివ్య పుట్టింటికి వెళ్లిపోయింది. ఐదేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన స్వరూపతో దత్తుకు పరిచయం ఏర్పడింది. వీరిద్దరు సహజీవనం చేయడంతో కుమారుడు జన్మించాడు. భార్యభర్తలుగా ఉంటున్న వీరి మధ్య ఇటీవల మనస్పర్థలు వచ్చాయి. దీంతో కొంతకాలంగా ఘర్షణ పడుతున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం షాపింగ్‌ చేయడానికి మోస్రాకు దత్తు, స్వరూప వెళ్లారు.

రాత్రివేళ స్వరూప మాత్రమే చింతకుంటకు తిరిగి వచ్చింది. మంగళవారం ఉదయం మోస్రా అటవీ ప్రాంతంలో దత్తు మృతదేహం ఉన్నట్లుగా గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలాన్ని బోధన్‌ ఏసీపీ రామారావ్, రుద్రూర్‌ సీఐ అశోక్‌ రెడ్డి, వర్ని ఎస్సై అనిల్‌రెడ్డి పరిశీలించి స్థానికుల ద్వారా వివరాలు సేకరించారు.

దత్తు హత్యలో సదరు మహిళ ప్రమేయం ఉందా..? మద్యం తాగే అలవాటు ఉన్న దత్తును ఎవరైనా అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేశారా..? అనే అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. సహజీవనం చేస్తున్న మహిళను హత్య చేసి ఉంటుందని హతుడి తండ్రి గంగాధర్‌ పీఎస్‌లో పిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విభిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.