ప్రియుడిని చంపిన 20 ఏళ్ల యువతి

20 ఏళ్ల ఓ యువతి తన ప్రియుడిని అతి దారుణంగా చంపించింది. అందుకోసం రూ.1.5 లక్షలు సుపారీగా ఇచ్చింది. దాంతో పాటు ఆ ఆఫర్ కూడా ఇచ్చింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ జిల్లాలో శుక్రవారం (ఫిబ్రవరి 26) ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడనే కారణంగానే ఆ యువతి తన ప్రియుడిని హత్య చేయించిందని పోలీసులు తెలిపారు.

నాగ్‌పూర్‌కు చెందిన చందూ మహాపూర్‌ స్థానికంగా 20 ఏళ్ల ఓ యువతితో సంబంధం పెట్టుకున్నాడు. కొంత కాలంగా వాళ్లిద్దరూ శారీరకంగా దగ్గర కావడంతో ఆ అమ్మాయి తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా చందూను కోరింది. కానీ, అందుకు అతడు నిరాకరించాడు. అతడికి అప్పటికే పెళ్లై పిల్లలు కూడా ఉండటమే అందుక్కారణం.

చందూ తనను పెళ్లి చేసుకోవడానికి నో చెప్పడంతో ఆ యువతి అతడిపై కోపం పెంచుకుంది. అతడిని కడతేర్చడానికి పథకం రచించింది. అందుకోసం చందూకు స్నేహితుడు, దూరపు చుట్టమైన భరత్ గుర్జార్‌ను ఎంచుకుంది. చందూను హత్య చేస్తే రూ.1.5 లక్షలు ఇస్తానని ఒప్పందం చేసుకుంది. అది కాకుండా, పడక సుఖాన్ని కూడా అందిస్తానని ఆఫర్ చేసింది. దీంతో చందూను హత్య చేయడానికి భరత్ అంగీకరించాడు. పైగా డబ్బుల విషయంలో చందూతో అతడికి ఓసారి గొడవ జరిగింది. అది కూడా మనసులో పెట్టుకున్నాడు.

భరత్ గుర్జార్ గురువారం మధ్యాహ్నం చందూ వద్దకు వచ్చాడు. అతడికి మద్యం పార్టీ ఇస్తానని ఓ చోటకు తీసుకెళ్లాడు. అక్కడ ఫూటుగా తాగించిన అనంతరం తలపై బలంగా రాయితో మోదాడు. అనంతరం కత్తితో గొంతు కోసి చంపేశాడు. ఆ తర్వాత మృతదేహాన్ని ఓ మైనింగ్ ప్రాంతంలో డంప్ చేసి పారిపోయాడు.

రాత్రి పొద్దుపోయినా చందూ ఇంటికి రాకపోవడంతో అతడి కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి చందూ.. భరత్‌పాటు వెళ్తున్నట్టు గుర్తించారు.

భరత్‌ను గాలిస్తూ పోలీసులు అతడు ఉన్న చోటుకి వెళ్లారు. అప్పటికే అతడు యువతి నుంచి లక్షన్నర రూపాయలు తీసుకున్నాడు. ఆమె ఆఫర్ చేసిన సుఖాన్ని కూడా పొందాడు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించాడు. హత్య వెనుక యువతి తల్లిదండ్రుల హస్తం కూడా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులందరినీ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు.