యువతి ఆత్మహత్య

తంజావూరు సమీపంలో ఉన్న తిరుకాట్టుపల్లి వేలంగుడికి చెందిన కల్యాణసుందరం చిన్న కుమార్తె భువనేశ్వరి (25)ను ఆర్కాడ్‌కు చెందిన కలియమూర్తి కుమారుడు రంగరాజ్‌ (30)తో ఏడాది క్రితం వివాహం అయింది. ఈ దంపతులు తిరుకాట్టుపల్లిలో కాపురం ఉంటున్నారు. మంగళవారం ఇంట్లో భువనేశ్వరి ఉరేసుకున్న స్థితిలో శవమై వేలాడుతూ కనిపించింది. తన కుమార్తె మృతి పట్ల అనుమానం ఉన్నట్లు కల్యాణసుందరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వివాహమైనప్పటి నుంచి అల్లుడు రంగరాజ్, అతని తండ్రి కలియమూర్తి, తల్లి సుమతి వరకట్నం కోసం వేధింపులకు గురి చేశారని, అల్లుడికి వేరొక యువతితో వివాహేతర సంబంధం ఉన్నట్లు తెలిపారు. నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసుస్టేషన్‌ ఎదుట బంధువులు బైఠాయించి ఆందోళన జరిపారు. దీని గురించి తిరువయ్యారు డీఎస్పీ సబీవుల్లా, ఇన్‌స్పెక్టర్‌ శ్రీదేవి కేసు నమోదు చేసి విచారణ జరిపారు. రంగరాజ్‌ను పోలీసులు అరెస్టు చేసి భువనేశ్వరి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపారు.