ముళ్ల‌పొద‌ల్లో ఆడ‌శిశువు

మహబూబాబాద్ : అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం రోజున ఓ ఆడ శిశువు ప‌ట్ల ఆమె త‌ల్లిదండ్రులు అమానుషంగా ప్ర‌వ‌ర్తించారు. అప్పుడే పుట్టిన ఆడ‌బిడ్డ‌ను ముళ్ల‌పొద‌ల్లో వ‌దిలేసి వెళ్లిపోయారు. ఈ ఘ‌ట‌న డోర్న‌క‌ల్ మండ‌లం బూరుగుపాడు వ‌ద్ద వెలుగు చూసింది. శిశువును గోనెసంచిలో చుట్టి ముళ్ల‌పొద‌ల్లో వ‌దిలేశారు. శిశువు ఏడుపును గ‌మ‌నించిన స్థానికులు త‌క్ష‌ణ‌మే అంగ‌న్‌వాడీ కార్య‌క‌ర్త‌కు స‌మాచారం అందించారు. అంగన్‌వాడీ కార్య‌క‌ర్త‌, ఆశా కార్య‌క‌ర్త‌ల స‌హాయంతో అంబులెన్స్‌లో శిశువును డోర్న‌క‌ల్ ఏరియా ఆస్పత్రికి త‌ర‌లించారు. న‌వ‌జాత శిశువు ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. శిశువు త‌ల్లిదండ్రుల ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

 

image source:ntnews.com