బీఫార్మసీ విద్యార్థి పై అత్యాచారం

బాధిత యువతి కొంపల్లిలో బీఫార్మసీ సెకండియర్ చదువుతోంది. రోజూ కాలేజీ నుంచి వచ్చే సరికి చీకటి పడుతుంది. రాంపల్లి చౌరస్తాలో కాలేజీ బస్సు దిగి అక్కడ నుంచి తన ఇంటికి ఆటోలో వెళ్తోంది. యంనంపేటకు చెందిన ప్రధాన నిందితుడు ఆ అమ్మాయిపై వారం రోజులుగా కన్నేసి ఈ వివరాలన్నీ తెలుసుకొని, పక్కా ప్రణాళికతో, మిత్రుల సాయంతో కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది.

ఎప్పటిలాగే బుధవారం (ఫిబ్రవరి 10) ఆ అమ్మాయి కాలేజీ నుంచి తిరిగొచ్చేసరికి సాయంత్రం 5.45 గంటల సమయం అయ్యింది. ప్రధాన నిందితుడు ఆమెను ఆటోలో ఎక్కించుకున్నాడు. మిగిలిన ఇద్దరికి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అప్పటికే ఆ ఆటోలో ఓ మహిళ, మరో యువకుడు ఉన్నారని.. కానీ, వాళ్లు తదుపరి స్టేజీలో దిగిపోయారని స్థానికులు తెలిపారు.

ప్యాసింజర్స్ దిగిపోయిన తర్వాత నిందితుడు ఆటో వేగం పెంచాడని.. కొంత దూరం వెళ్లిన తర్వాత మరో ఇద్దరు యువకులు ఆటోలో ఎక్కారని బాధితురాలు పోలీసులతో చెప్పింది. యువతి దిగాల్సిన స్టేజీ వద్ద ఆపకుండా ఆటోను స్పీడ్‌గా ముందుకు పోనివ్వడంతో ఆమె వెంటనే తన ఫోన్ తీసి తల్లికి కాల్ చేసినట్లు తెలిపింది. దీంతో యువతి కుటుంబసభ్యులు కీసర పోలీసులను సంప్రదించారు.

కిడ్నాప్ సమాచారం అందడంతో మల్కాజిగిరి డీసీపీ రక్షితా మూర్తి.. కీసర, ఘట్కేసర్ పోలీసులను అప్రమత్తం చేశారు. నాలుగైదు పోలీసు బృందాలను ఏర్పాటు చేశారు. బాధితురాలి ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా ఆమె ఘట్కేసర్‌కు సమీపంలోనే ఉన్నట్లు తెలుసుకున్నారు. ఆ ప్రాంతానికి చేరుకునేసరికి ఆమె అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

నలుగురు నిందితులు కలిసి తనను ఘట్కేసర్ సమీపంలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యం చేశారని బాధితురాలు పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. ఆమెకు మత్తు మందు ఇచ్చి అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. పోలీసులు సకాలంలో అక్కడికి చేరుకోకపోయుంటే బాధితురాలిని చంపేసేవారేమోనని ఆందోళన వ్యక్తమవుతోంది.

రహదారి వెంట సైరన్ చేస్తూ పోలీసుల వాహనాలు దూసుకొచ్చాయి. ‘ఆటోలో అమ్మాయిని కిడ్నాప్ చేశారు. ఎవరైనా చూస్తే సమాచారం ఇవ్వండి’ అంటూ మైకుల్లో ప్రకటన చేశారు. పోలీసులు వెంబడిస్తున్నట్లు గ్రహించిన నిందితులు యువతిని అక్కడే వదిలేసి పారిపోయారు.

యువతి మొబైల్ సిగ్నళ్ల ఆధారంగా పోలీసులు ఆమె ఆచూకీని గుర్తించారు. బాధితురాలిని వెంటనే స్థానిక ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. సీసీ టీవీ ఫుటేజ్‌లను పరిశీలించి నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

ఘటనపై ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు గురువారం ఘట్కేసర్ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. బాధితురాలు తన తల్లికి ఫోన్ చేయకపోయుంటే పరిస్థితి మరోలా ఉండేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం యువతి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని మల్కాజిగిరి డీసీపీ రక్షిత మూర్తి తెలిపారు. రాడ్డుతో కొట్టడం వల్ల బాధితురాలి కాలికి గాయమైనట్లు వెల్లడించారు.