రైలు బోగీలను తగలబెట్టిన సెల్పీ సరదా

సెల్పీ సరదా యువకుడి ప్రాణాలు తీయడంతోపాటు రెండు రైలు బోగీలను తగలబెట్టింది. ఒక్కసారిగా విద్యుత్ వైర్లు తగలడంతో మంటలు చెలరేగి యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. నిప్పురవ్వలు ఎగసిపడి బోగీలు తగలబడిపోయాయి. ఈ షాకింగ్ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. పర్లాకిమిడి మీదుగా రాకపోకలు సాగించే రైళ్లు ఇటీవల రద్దయ్యాయి. దీంతో ప్యాసింజర్ రైలుని ప్లాట్‌ ఫైం ఉంచి ఇంజిన్‌ను వేరుచేసి బోగీలను వదిలేశారు. అక్కడి నుంచి సమీపంలోని మరో స్టేషన్ మధ్య ఎలక్ట్రిక్ లైన్‌ను సరిచేస్తున్నారు.

స్నేహితులతో కలసి స్టేషన్‌ వైపు వచ్చిన యువకుడు ట్రాక్‌పై నిలిపి ఉంచిన రైలు బోగీలపైకి ఎక్కి సెల్ఫీ తీసుకోవాలని భావించాడు. ట్రైన్ బోగీ పైకెక్కి సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తూ విద్యుత్ వైర్‌ని పట్టుకోవడంతో షాక్‌కి గురయ్యాడు. యువకుడు మంటల్లో కాలిపోయాడు. బోగీలపై గోనెసంచులు ఆరేసి ఉండడంతో నిప్పురవ్వలు ఎగసి వాటిపై పడి మంటలు వ్యాపించాయి. దీంతో రెండు రైలు బోగీలు అగ్నికి ఆహుతయ్యాయి. అప్రమత్తమైన రైల్వే సిబ్బంది, స్థానికులు రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చారు.