సంగారెడ్డి జిల్లాలో పెద్ద అగ్ని ప్రమాదం

సంగారెడ్డి జిల్లా పరిధిలోని ఐడీఏ బొల్లారం పారిశ్రామిక వాడలో (ఇండస్ట్రియల్ పార్క్) పెద్ద అగ్ని ప్రమాదం సంభవించింది. ఆదివారం సాయంత్రం చిన్న ఖేతాన్‌ అనే కర్మాగారంలో జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఆరుగురికి తీవ్రంగా గాయాలు అయ్యాయి.

చనిపోయిన వ్యక్తి మహిళ అని తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం వెంటనే ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు.

అయితే అగ్ని ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం జరిగిందా..? లేక ఇంకా ఏదైనా కారణంతో జరిగిందా? అనే దానిపై అధికారులు విచారణ జరుపుతున్నారు.

ఆరుగురు కార్మికులు గాయపడగా.. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను బాచుపల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పేలుడు కారణంగా ఈ అగ్ని ప్రమాదం సంభవించి ఉంటుందని తెలుస్తోంది.