కూతురిని అమ్మకానికి పెట్టిన తండ్రి

తాగుడుకు బానిసైన ఓ తండ్రి సొంత కూతురిని అమ్మకానికి పెట్టాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్‌లో చోటు చేసుకుంది. వన్‌టౌన్‌ సీఐ రాజేశ్వర్‌గౌడ్‌ కథనం ప్రకారం.. పట్టణంలోని హనుమాన్‌పురకు చెందిన సయ్యద్‌ రహీం, నౌషిమ్‌ బేగం దంపతులకు ఇద్దరు కొడుకులు, కుమార్తె (18 నెలలు) ఉన్నారు. ఈ నెల 18న రహీం తన కూతురు జేబాను బిస్కెట్లు ఇప్పిస్తానని నమ్మబలికి బయటకు తీసుకెళ్లాడు. వారు ఇంటికి తిరిగి రాకపోవడంతో భార్య అతడికి ఫోన్‌ చేసినా స్పందించలేదు. సాయంత్రం భర్త ఒక్కడే తిరిగి వచ్చాడు.

కూతురు ఎక్కడ అని నిలదీస్తే.. మొదట సరైన సమాధానం చెప్పలేదు. తర్వాత గట్టిగా ప్రశ్నిస్తే హైదరాబాద్‌కు చెందిన సయ్యద్‌ హఫీజ్‌కు రూ.15 వేలకు విక్రయించినట్లు తెలిపాడు. దీంతో నౌషిమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రత్యేక బృందం రంగంలోకి దిగి.. 24 గంటల్లోనే హైదరాబాద్‌లో ఉన్న పాపను గుర్తించి మహబూబ్‌నగర్‌ సీడబ్ల్యూసీ అధికారులకు అప్పగించారు. పాపను కొనుగోలు చేసిన సయ్యద్‌ హఫీజ్, తండ్రి సయ్యద్‌ రహీంలను అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు.