మరో పరువు హత్య

పరువు రక్కసికి మరో ప్రణయ్ బలైపోయాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి కూతురు భర్తను అతి కిరాతకంగా చంపేశాడు ఆమె తండ్రి. ఈ దారుణ ఘటన కేరళలోని పాలక్కడ్ జిల్లాలో జరిగింది. తెన్కురిసికి చెందిన అనీష్(27) అదే ప్రాంతానికి చెందిన హరిత అనే యువతిని ప్రేమించాడు. ఆమె తండ్రి ప్రభు కుమార్‌ స్థానికంగా పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో తన కూతురిని వదిలేయాలని.. లేకుంటే చంపేస్తానని బెదిరించాడు. పలుమార్లు హెచ్చరించాడు.

అయినా ప్రేమికులు భయపడకుండా వివాహ బంధంతో ఒక్కటవడంతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరిగాయి. తమకు రక్షణ కల్పించాలంటూ నవ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చారు. అయితే ఇష్టం లేని పెళ్లి చేసుకున్న కూతురిపై కోపం పెంచుకున్న ప్రభు కుమార్.. ఆమె భర్తను ఎలాగైనా అంతమొందించాలని అదను కోసం వేచి చూశాడు.

శుక్రవారం సాయంత్రం ఆఫీస్‌ నుంచి ఇంటికి బయల్దేరిన అనీష్‌ని దారికాచి దారుణంగా చంపేశాడు. యువతి తండ్రి ప్రభుకుమార్, ఆమె మేనమామ సురేష్‌ అనీష్‌ని అడ్డుకుని మారణాయుధాలతో దాడి చేశారు. రక్తపు మడుగులో కుప్పకూలిపోయిన అనీష్‌ని స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.