అవమానంతో కూతురిని చంపిన తండ్రి

పెడదారి పట్టిందంటూ కన్నతండ్రే కూతురిని కడతేర్చాడు. పెళ్లైన తర్వాత వేరే వ్యక్తితో పారిపోయి పరువు తీసిందన్న కోపంతో పాశవికంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన రాజస్తాన్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. దౌసా జిల్లాకు చెందిన శంకర్‌ లాల్‌ సైనీ(50)కి కుమార్తె పింకీ ఉంది. పందొమిదేళ్ల పింకీ అభీష్టానికి వ్యతిరేకంగా ఫిబ్రవరి 16న వివాహం జరిపించాడు సైనీ. అయితే, ఇష్టం లేని పెళ్లి చేశారంటూ భర్తతో ముభావంగా ఉన్న ఆమె, మూడు రోజుల్లోనే పుట్టింటికి చేరింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 21న తన ప్రియుడు రోషన్‌తో కలిసి ఇంటి నుంచి పారిపోయింది.

దీంతో ఆమె కుటుంబం తీవ్ర అవమాన భారంతో కుంగిపోయింది. ఈ నేపథ్యంలో కూతురు పింకీ కనిపించడం లేదని, ఆమెనుఎవరో కిడ్నాప్‌ చేశారంటూ సైనీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే, పోలీసుల కంటే ముందే తనే, కూతురి జాడను కనుక్కున్న అతడు, ఆమెను ఇంటికి తీసుకువచ్చాడు. ఈ క్రమంలో ఇరువురి మధ్య ఘర్షణ చెలరేగగా, గొంతు నులిమి పింకిని చంపేశాడు.

అనంతరం స్థానిక పోలీస్‌ స్టేషనుకు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసు ఉన్నతాధికారి దీపక్‌ కుమార్‌ గురువారం మీడియాకు తెలిపారు. కాగా ఉత్తరప్రదేశ్‌లో కూడా బుధవారం ఇదే తరహా ఘటన చోటుసుకున్న విషయం తెలిసిందే. కూతురు ప్రేమలో ఉన్న విషయం తెలుసుకున్న ఓ తండ్రి, ఆమె తల నరికాడు. పోలీసుల ఎదుట నేరం అంగీకరించి, జైలుకు వెళ్లాడు.