కన్న కూతురినే అత్యంత పాశవింగా హతమార్చాడో తండ్రి

ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. కన్న కూతురినే అత్యంత పాశవింగా హతమార్చాడో తండ్రి. ఆపై తల నరికి, చేతిలో పట్టుకుని పోలీస్‌ స్టేషనుకు బయల్దేరాడు. ఈ ఘటన హర్దోయి జిల్లాలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. వివరాలు.. పండేతారా గ్రామానికి చెందిన సర్వేశ్‌ కుమార్‌ అనే వ్యక్తికి పదిహేడేళ్ల కూతురు ఉంది. కాగా గత కొన్ని రోజులుగా ఆమె ఓ వ్యక్తిని ప్రేమిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న సర్వేశ్‌ కోపంతో రగిలిపోయాడు. ప్రతిష్టకు మచ్చ తెచ్చే పని చేసిందంటూ పదునైన ఆయుధంతో ఆమెను నరికి చంపాడు.

ఆ తర్వాత మొండెం నుంచి తలను వేరు చేసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, బాటసారులు విషయం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడికి చేరుకుని ప్రశ్నించగా..‘‘నేనే చేశాను. ఇందులో వేరే ఎవరికీ ప్రమేయం లేదు. తలుపులు గడియపెట్టి తనను నరికాను. ఆ తర్వాత మొండాన్ని అక్కడే పడేసి తల స్టేషనుకు తీసుకువస్తున్నా’’అంటూ ఏమాత్రం బెదురు లేకుండా సమాధానమిచ్చాడు. ఆ సమయంలో అతడిలో పశ్చాత్తాపం కనిపించలేదని పోలీసులు తెలిపారు. సర్వేశ్‌ను అరెస్టు చేసి, విచారణ చేపట్టినట్లు వెల్లడించారు.