అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్య

కరోనా ఆ కుటుంబాన్ని అప్పుల పాలుజేసింది. ఫలితంగా తీవ్ర దారిద్య్రంలో కూరుకుపోయిన ఆ దంపతులు ముగ్గురు బిడ్డలకు విషం ఇచ్చి.. ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాధ ఘటన ఉసిలంపట్టిలో సోమవారం చోటు చేసుకుంది. మదురై జిల్లా, ఉసిలంపట్టికి చెందిన శరవణన్‌ నగల వర్క్‌షాపు నడుపుతుండేవాడు. ఇతని భార్య శ్రీనిధి. వీరికి కుమార్తెలు మహాలక్ష్మి (10), అభిరామి (5), కుమారుడు అముదన్‌ (5) ఉన్నారు. 20 ఏళ్లుగా వర్క్‌షాపు నడుపుతూ వచ్చిన శరవణన్‌ వ్యాపారాన్ని కరోనా పరిస్థితులు దారుణంగా దెబ్బతీశాయి.

దీంతో గత కొన్ని నెలలుగా అప్పుల బాధతో అవస్థలు పడుతూ కుటుంబాన్ని నెట్టుకువచ్చారు. అయితో రోజురోజుకూ పరిస్థితి దిగజారింది. ఈ నేపథ్యంలో సోమవారం ఈ దంపతులు తమ ముగ్గురు పిల్లలకు విషం ఇచ్చి.. ఆ తర్వాత వారు సేవించారు. కొద్దిసేపటికే నురగలు కక్కుకుంటూ ఐదుగురూ మృతిచెందారు. స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. అలాగే సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాదీనం చేసుకున్నట్లు తెలిసింది.