ఫేస్‌బుక్‌ ప్రేమ

ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైన యువకుడిని వివాహం చేసుకోవడానికి పాస్‌పోర్టు లేకుండా భారతదేశంలోకి వచ్చి చెన్నైలో నివాసముంటున్న బంగ్లాదేశ్‌ యువతిని పోలీసులు అరె స్టు చేశారు. పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో నివాసముంటున్న శశిషేక్‌ (28)కు ఫేస్‌బుక్‌ ద్వారా బంగ్లాదేశ్‌కు చెందిన పాపియో ఖోష్‌(22) అనే యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. దీంతో పాపియో ఖోష్‌ పాస్‌పోర్టు లేకుండా బంగ్లాదేశ్‌ నుంచి పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలోకి వ చ్చింది. అనంతరం ఇద్దరూ తమిళనాడు చేరుకుని ఈ నెల 12న కోవై జిల్లా పొల్లాచ్చిలో రిజిస్టర్‌ మ్యారేజ్‌ చేసుకున్నారు.

చెన్నై మీంజూర్‌లో నివాసం ఉంటున్నారు. తన కుమార్తె కనిపంచడం లేదని బంగ్లాదేశ్‌ పోలీసులకు యువతి తండ్రి ఫిర్యాదు చేశాడు. బంగ్లాదేశ్, భారత పోలీసులు జరిపిన విచారణలో యువతి మీంజూరులో ఉన్నట్లు సీబీసీఐడీ పోలీసులకు సమాచారం అందింది. కాంచీపురం పోలీసులు పాపియో ఖోష్‌ను అదుపులోకి తీసుకున్నారు. మీంజూరు పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై తిరువళ్లూరు జిల్లా ఎస్పీ అరవిందన్, డీఎస్పీ కల్పనాదత్‌ స్వయంగా విచారణ చేశారు. పాస్‌పోర్టు లేకుండా దేశంలోకి చొరబడినట్లు తేలడంతో యువతిని పొన్నేరి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.