ఇద్దరు యువకుల మద్యం మత్తు ఒక ఆశయాన్ని బలిగొంది..ఒంట్లో సత్తువ ఉన్నంత వరకు ఎవరిపై ఆధారపడొద్దనుకున్న ఆయన ఆదర్శాన్ని దూరం చేసింది. ఆరుపదుల వయసు..గజగజ వణికించే చలిలో కూరగాయలు విక్రయించేందుకు వెళ్తూ మృత్యుఒడిలోకి వెళ్లిపోయాడు. పీకలదాకా తాగి, కారును అతివేగంగా నడుపుతూ ఢీకొట్టడంతో ఓ వృద్ధుడు కన్నుమూశాడు. చూడటానికి సాధారణ ప్రమాదమే కావొచ్చు.. బాధ్యత మరిచిన ఇద్దరు యువకుల మద్యంమత్తుకు జీవితాన్ని గెలిచిన ఒక వృద్ధుడు అసువులు బాయటం అందరినీ కలిచివేస్తున్నది. చెట్టంత కొడుకులు ఉద్యోగాలు చేస్తున్నా వారి మీద ఆధారపడకుండా నిత్యం కూరగాయలు అమ్ముతూ తనతోపాటు భార్యను పోషించుకుంటున్నాడు. వీఎస్టీ వద్ద శుక్రవారం తెల్లారగట్ల జరిగిందీ రోడ్డు ప్రమాదం. ఆ సమయంలో కారు 100 కి.మీ.స్పీడ్‌తో ఉండగా, ఇద్దరు యువకుల మద్యం మత్తు 200 మిల్లీగ్రాములు. మద్యం తాగి వాహనాలు నడుపొద్దని పోలీసులు ఎంత మొత్తుకుంటున్నా పెడచెవిన పెట్టిన ఫలితమిది.
డిసెంబర్ 31… కాల గమనంలో ఒక ఏడాదికి వీడ్కోలు పలికే రోజు… అనుభవాల సారాంశంతో కొత్త ఏడాదిలో మరింత నూతనోత్తేజంగా విజయాల వైపు దూసుకుపోవాలనే ఆకాంక్షతో వేడుక జరుపుకుంటాం… కానీ కొందరు యువకులు ఆ వాస్తవాల్ని మరుస్తున్నారు… కొత్త ఏడాదిని కండ్లారా చూసే పరిస్థితి లేకుండా పీకలదాకా తాగి.. మత్తులో తూగుతున్నారు.. బాధ్యత కలిగిన పౌరులమని మరవడమే కాదు… అమాయకుల ప్రాణాలను సైతం బలిగొంటున్నారు.. ఇదే కోవలో గురువారం రాత్రి నుంచి తాగడమే పనిగా పెట్టుకున్న ఇద్దరు యువకులు… శుక్రవారం తెల్లవారుజామున ర్యాష్ డ్రైవింగ్‌తో ఒక వృద్ధుడిని బలిగొన్నారు.