ఖైరతాబాద్‌లో మాదక ద్రవ్యాలు పట్టివేత..

హైదరాబాద్‌ : ఖైరతాబాద్‌ ఎంఎస్‌ మక్తాలో బుధవారం ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు మాదక ద్రవ్యాలను పట్టుకున్నారు. 153 గ్రాముల కొకైన్‌, 16 గ్రాముల ఎండీఎంఏ స్వాధీనం చేసుకున్నారు. అలాగే మాదక ద్రవ్యాల సరఫరా ఏజెంట్‌గా పని చేస్తున్న నైజీరియన్‌ జేమ్స్‌ మోరిసన్‌ను అరెస్టు చేశారు. ఆ వ్యక్తి ఉంటున్న ఎంఎస్‌మక్తాలోని నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. అతడిని అదుపులోకి తీసుకొని ఫోన్‌, తూకం పరికరం, డ్రగ్స్‌ సరఫరాకు సంబంధించిన వివరాలు రాసుకున్న నోట్‌బుక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డ్రగ్స్‌ సరఫరా విషయంలో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు కీలక విషయాలను రాబట్టారు. డ్రగ్స్‌ సరఫరా చేస్తున్న నైజీరియన్‌కు పలు ముఠాలతో సంబంధాలున్నాయని నిర్ధారించారు. బెంగళూరు, గోవాకు చెందిన ముఠాలతో సంబంధాలున్నట్లు గుర్తించారు. అయితే, బెంగళూరుకు చెందిన ముఠా మోరిసన్‌ను ఏజెంట్‌గా నియమించుకున్నట్లుగా తేలింది. ఈ ముఠాలో మైక్‌, డాడీబాయ్‌ కీలకపాత్ర పోషిస్తున్నట్లు ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు గుర్తించారు. ముఠా వాట్సాప్‌ కాల్‌ ద్వారా ఆర్డర్లు తీసుకుంటూ సరఫరా చేస్తున్నారు. అలాగే మరికొందరికి నేరుగా డ్రగ్స్‌ను అందజేస్తున్నారు. అయితే, ప్రస్తుతం పట్టుబడిన నిందితుడు జేమ్స్‌ మోరీసన్‌ గతంలోనూ డ్రగ్స్‌ కేసులో జైలుకు వెళ్లి వచ్చాడని అధికారులు పేర్కొన్నారు.