ఓ నరరూప రాక్షసుడు వయోభారంతో ప్రాణాలు విడిచాడు. సీరియల్ కిల్లర్‌గా మారి పదుల సంఖ్యలో మనుషుల ప్రాణాలు తీసిన ఆ వ్యక్తి మామూలు మరణం పొందాడు. అమెరికా హిస్టరీలో పక్కా ప్రొఫెషనల్ కిల్లర్‌గా సామ్యూల్ లిటిల్ పేరు పొందాడు. అతని జీవితం ఆద్యంతం నేరమయమే. అతను మరణించే నాటికి అంటే నిన్నటికి అమెరికాలోని 19 రాష్ట్రాల్లో 93 మందికి పైగా ప్రాణాలు బలిగొన్న రాక్షసుడిగా రికార్డులకెక్కాడు.అతని మరణాన్ని కాలిఫోర్నియా కరెక్షన్స్ అండ్ రీహాబిలిటేషన్ డిపార్ట్‌మెంట్ ప్రకటించింది. 80 ఏళ్ల వయసులో వయోభారంతో అతను తుదిశ్వాస విడిచినట్టు ఆ సంస్థ వెల్లడించింది.జార్జియాలో 1940, జూన్ 7న సామ్యూల్ జన్మించాడు. సామ్యూల్‌ను చిన్నతనంలోనే తల్లి తన బంధువుల ఇంట్లో వదిలి వెళ్లింది. దీంతో అతని బాల్యం భారంగా గడిచింది. అప్పుడే సమాజంపై ఒక రకమైన కసి పెంచుకున్నాడు. ఒంటరితనం అతన్ని వెంటాడింది. ఐదో తరగతి చదువుతున్నప్పుడు ఓ టీచర్ ప్రవర్తన అతని జీవితాన్ని గతి తప్పేలా చేసింది. టీచర్ తన మెడను రుద్దుకున్నప్పుడు గమనించిన సామ్యూల్… అప్పటి నుంచి ఎవరి మెడను చూసినా గొంతు పిసికి వేయాలనే కోరిక పుట్టేది.అలాంటి ఆలోచనలు తనను వెంటాడుతుండగా, సహ విద్యార్థినిని చంపడానికి అనేక సార్లు ప్రయత్నించి విఫలమయ్యాడు. ఈ విషయాన్ని ఆయనే ఇటీవల ప్రకటించాడు. పదమూడేళ్ల వయస్సులో దొంగతనంతో ప్రారంభమైన నేర ప్రస్థానం … అనంతర కాలంలో సీరియల్ కిల్లర్‌గా రూపాంతరం చెందింది. తన జీవిత కాలంలో సుమారు 93 మంది మహిళల ఉసురు తీయడం గమనార్హం. మృతులంగా మహిళలే కావడం గమనార్హం. మహిళల ఒంటిపై ఆభరణాలను దోచుకుని, గుట్టుచప్పుడు కాకుండా శవాల్ని ముళ్ల పొదల్లో పారేసేవాడు. పోలీసులకు ఎలాంటి ఆనవాళ్లు దొరక్కుండా జాగ్రత్త పడేవాడు.అయితే ఒక హత్య కేసులో లభించిన క్లూతో 2014లో అతను అరెస్టు అయ్యాడు. సాంకేతిక పరిజ్ఞానంతో నేరాన్ని రుజువు చేయడంతో అతడికి యావజ్జీవ కారాగార శిక్షను కోర్టు విధించింది. ఆరేళ్లుగా కాలిఫోర్నియాలోని జైలులో శిక్ష అనుభవిస్తున్న సామ్యూల్ బుధవారం ప్రాణాలు కోల్పోయాడు.
