ఉరేసుకుని ఆత్మహత్య

వివాహేతర సంబంధం వల్ల దంపతులు, పోలీసుల విచారణకు భయపడి ఓ ప్రియుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం చోటు చేసుకుంది. చెంగల్పట్టు కైలాసనాథర్‌ ఆలయం వీధికి చెందిన గోపి (38) భార్య కన్నియమ్మాళ్‌కు అదే ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్‌ సురేష్‌ (45)తో గత ఐదేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. సురేష్‌కు పెళ్లై భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. భార్య వివాహేతర సంబంధం గురించి తెలిసి గోపీ ఆమెను తీవ్రంగా మందలించాడు. ఈ విషయంపై శుక్రవారం గోపీ, సురేష్‌ గొడవపడ్డారు.

తరువాత ఇంటికి వచ్చిన గోపీ తన భార్య కన్నియమ్మాళ్‌తో గొడవకు దిగాడు. అయితే శనివారం ఉదయం గోపీ, కన్నియమ్మాళ్‌ ఇద్దరూ ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. చెంగల్పట్టు టౌన్‌ పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. కేసు నమోదు చేసిన పోలీసులు సురేష్‌ను విచారించాలని భావించగా, అతను కూడా ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గోపీ, కన్నియమ్మాళ్‌ ఆత్మహత్య చేసుకోవడంతో వారి కుమార్తె అనాథగా మిగిలింది. అదే సమయంలో సురేష్‌ మృతితో అతని ముగ్గురు కుమార్తెలు, భార్య దిక్కులేనివారు ఆయ్యారు.