భార్యని హతమార్చిన కానిస్టేబుల్

స్పెషల్ ఆర్మ్‌డ్ ఫోర్స్ (ఎస్ఏఎఫ్) కానిస్టేబుల్, ఆయన భార్యపై మారణాయుధంతో దాడిచేసి హతమార్చిన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో గురువారం చోటుచేసుకుంది. కానిస్టేబుల్ కుమార్తె, ఆమె ప్రియుడు ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కానిస్టేబుల్ జ్యోతి ప్రసాద్ శర్మ (45), భార్య నీలిమ (43) ఏరోడ్రోమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న తమ ఇంట్లోనే రక్తపు మడుగులో పడి ఉన్నట్టు పోలీసులు తెలిపారు. పదునైన ఆయుధంతో పొడిచి హత్యచేసినట్టు ఇండోర్ అదనప్పు ఎస్పీ ప్రశాంత్ చౌబే పేర్కొన్నారు.

గురువారం తెల్లవారుజామున జ్యోతి ప్రసాద్ కుమార్తె బయట తిరుగుతుండగా.. ఆ ఇంటిలో నుంచి పెద్ద అరుపులు, శబ్దాలు వచ్చినట్టు ప్రత్యక్ష సాక్షులు గుర్తించారు అని ఏఎస్పీ తెలిపారు. ఇరుగు పొరుగువారు, ఆ ఇంటికి సమీపంలో ఉండే జ్యోతి ప్రసాద్ తల్లిదండ్రులు ఏం జరిగిందని ఆమెను అడిగితే అమ్మానాన్న గొడవ పడుతున్నారని చెప్పిందని అన్నారు.

జంట హత్యలు తర్వాత జ్యోతి ప్రసాద్ కుమార్తె, ఆమె ప్రియుడు కనిపించకుండాపోయారని, ఈ హత్యలో వారిపైనే అనుమానం ఉందని ఏఎస్పీ పేర్కొన్నారు. వారికోసం పోలీసులు గాలిస్తున్నారని తెలిపారు. నెల రోజుల కిందట జ్యోతి ప్రసాద్‌కు, కుమార్తె ప్రియుడికి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్టు ఎస్పీ చౌబే తెలియజేశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు.. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. తమ కుమార్తె వెంటపడొద్దని మందలించినందుకే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు భావిస్తున్నారు.