ఊపిరాడక చిన్నారులు మృతి

ఆడుకోవడానికి కారులోకి వెళ్లిన చిన్నారులు ఊపిరాడక కన్నుమూసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. సింగౌలి తాగ అనే గ్రామంలో అనిల్‌ త్యాగి అనే వ్యక్తికి చెందిన కారులో అడుకోవడానికి ఐదుగురు చిన్నారులు ఎక్కారు. అనంతరం కారు డోర్లు లాక్‌ అయిపోవడంతో వారంతా ఊపిరాడక మరణించారని పోలీసులు వెల్లడించారు. మరణించిన చిన్నారులను నియతి (8), అక్షయ్‌ (4), వందన (4), క్రిష్ణ (7)లుగా గుర్తించారు.

వీరితో పాటే కారులో ప్రవేశించిన శివాన్‌(8) మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ మంగళ్‌ సింగ్‌ ఘటనాస్థలిని పరిశీలించారు. ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే చిన్నారులు ఊపిరాడక మరణించినట్లు ఉందన్నారు. అయితే చుట్టుపక్కల వారు మాత్రం కారు ఓనర్‌ అనిల్‌ త్యాగి నిర్లక్ష్యం వల్లే పిల్లలు మరణించారని ఆరోపించారు.