లోయలోకి దూసుకెళ్లిన బస్సు

ఇండోనేషియాలోని జావా దీవిలో గురువారం తెల్లవారుజామున అర్థరాత్రి దాటాకా ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. యాత్రికులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తూ లోయలో పడిపోవడంతో 27 మంది మృతి చెందగా.. మరో 35 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ జావాలోని ఇస్లామిక్‌ జూనియర్‌ హైస్కూల్‌కు చెందిన విద్యార్థులు తమ తల్లిదండ్రులతో పాటు టీచర్లు కలిసి బుధవారం విహారయాత్రకు బయల్దేరారు.

బుధవారం అర్థరాత్రి దాటాకా సుమేడాంగ్‌ జిల్లాలో ప్రయాణిస్తున్న సమయంలో బస్సు ఒక్కసారిగా అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయకచర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికి తీయగా.. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ ప్రారంభించారు. కాగా బస్సు బ్రేకులు పనిచేయకపోవడం వల్లే ప్రమాదం సంభంవించి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.