చెల్లెల్ని తుపాకితో కాల్చిన అన్నయ్య

ఎంత చెప్పినా వినకుండా స్నేహితుడితో వాట్సాప్‌లో చాటింగ్‌లు, ఫోన్‌లో మాట్లాడుతోందన్న కోపంతో చెల్లెల్ని తుపాకితో కాల్చేశాడు ఓ అన్నయ్య. ఈ సంఘటన ఢిల్లీలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఢిల్లీలోని వెల్‌కమ్‌ ప్రాంతానికి చెందిన ఓ కుర్రాడు ఓపెన్‌ స్కూల్లో చదువుకుంటూ, సెలూన్‌లో పని చేస్తున్నాడు. అతడి చెల్లెలు చదువు మానేసి ఇంటి వద్దే ఉంటోంది. సోదరి తరచుగా ఓ స్నేహితుడితో చాటింగ్‌ చేయటం, ఫోన్‌లో మాట్లాడటం అతడికి నచ్చలేదు. స్నేహితుడితో చాటింగ్‌లు, టాకింగ్‌లు మానేయాలని చాలా సార్లు చెప్పాడు.

అయితే ఆమె వినలేదు. గురువారం ఉదయం ఈ విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఆగ్రహానికి గురైన అతడు తుపాకితో చెల్లెలిపై కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. కుటుంబసభ్యులు బాలికను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వర్గాలు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.