తాగిన మత్తులో పెళ్ళికొడుకుని చంపిన మిత్రులు

హైద‌రాబాద్‌:  ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని అలీఘర్‌‌లో దారుణం జ‌రిగింది.  పెళ్లి సంబ‌రాల్లో తాగిన వ‌రుడి మిత్రులు పెళ్లి కుమారుడిని హ‌త్య చేశారు. వేడుక‌ల్లో ఎంజాయ్ చేసేందుకు ఇంకా మందు కావాలంటూ వరుడిని వేధించిన అత‌ని మిత్రులు.. చివ‌ర‌కు ఆ పెళ్లి కుమారుడినే హ‌త్య చేశారు.  ఈ ఘ‌ట‌న సోమ‌వారం రాత్రి పాలిముకిమ్ పుర్ గ్రామంలో జ‌రిగింది.  పెళ్లి చేసుకున్న ఆనందంలో అప్ప‌టికే తాగిన ఫ్రెండ్స్‌ను ప‌లుక‌రించేందుకు 28 ఏళ్ల వ‌రుడు బ‌బ్లు వెళ్లాడు. అయితే త‌మ‌కు ఇంకా మ‌ద్యం తెప్పించాలంటూ ఆ వ‌రుడి స్నేహితులు డిమాండ్ చేశారు. ఈ నేప‌థ్యంలో వారి మ‌ధ్య వాగ్వాదం చోటుచేసుకున్న‌ది.  ఆ స‌మ‌యంలో తాగిన మైకంలో పెళ్లి కుమారుడిని అత‌ని మిత్రులే క‌త్తితో పొడిచి చంపారు. గాయ‌ప‌డ్డ వ‌రుడిని హాస్పిట‌ల్‌కు తీసుకువెళ్లిన అత‌ను బ్ర‌త‌క‌లేదు.  ఈ హ‌త్య‌లో ప్ర‌ధాన నిందితుడైన రామ్‌ఖిలాడీని అరెస్టు చేశారు.  కేసుతో లింకున్న మ‌రో అయిదుగురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.