ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య

ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన హత్నూర మండలం దౌల్తాబాద్‌ గ్రామంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై శ్రీకాంత్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దౌల్తాబాద్‌ గ్రామానికి చెందిన వనమాల కృష్ణ కుమారుడు సాయిచరణ్‌(24) ఇంట్లో తల్లిదండ్రులు ఎవ్వరూ లేకపోవడంతో స్నేహితులతో కలిసి ఆదివారం రాత్రి మద్యం సేవించారు. స్నేహితులతో ఈ సందర్భంగా ఘర్షణ జరిగింది. స్నేహితులు వెళ్లిపోయిన తర్వాత ఇంట్లో ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం తల్లిదండ్రులు వచ్చేసరికి ఇంట్లో సాయి చరణ్‌ ఫ్యానుకు వేలాడుతూ విగతజీవిగా కనిపించాడు.

ఇరుగుపొరుగు వారిని ఏం జరిగిందో తెలుసుకోగా కొంతమంది స్నేహితులు రాత్రి ఇంట్లో మద్యం సేవించి గలాటా వినిపించింది. అని తెలుసుకున్న తల్లిదండ్రులు వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్సై శ్రీకాంత్‌ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి వెళ్లి విచారణ చేపట్టారు. తండ్రి కృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. జిన్నారం సీఐ లాలూ నాయక్‌ సైతం ఈ కేసులో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.