ప్రియుడి మోసం.... యువతి ఆత్మహత్య

పొద్దున్నే పెళ్లనగా వరుడికి ఊహించని షాక్ తగిలింది. తాను చేసిన పాపం వెంటాడడంతో పెళ్లి పీటలెక్కాల్సిన వాడు నేరుగా జైలుఊచలు లెక్కబెట్టాల్సి వచ్చింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రియురాలిని లొంగదీసుకుని.. మోజు తీరాక మరో యువతితో పెళ్లికి రెడీ అయిన ప్రియుడికి తగిన శాస్తి జరిగింది. అయితే మోసపోయానన్న బాధతో యువతి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదం నింపింది. ఈ ఘటన యూపీలో వెలుగుచూసింది.

ముజఫ్ఫర్ నగర్‌కి చెందిన యువకుడు(27) అదే ప్రాంతానికి చెందిన యువతి(26) కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన యువకుడు ప్రియురాలిని శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఆమెపై లైంగిక దోపిడీకి పాల్పడ్డాడు. పెళ్లి చేసుకోబోయేవాడే కదా అని యువతి ప్రియుడితో హద్దులు దాటింది. తీరా ఆమెపై మోజు తీరాక ప్రియుడు ముఖం చాటేశాడు. మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు.

ఆ విషయం తెలుసుకున్న ప్రియురాలు ఈ నెల 20న పోలీసులను ఆశ్రయించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి మరో యువతితో పెళ్లికి రెడీ అయ్యాడని ఫిర్యాదు చేసింది. అయినా యువకుడి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో దారుణ నిర్ణయం తీసుకుంది. మరుసటి రోజు మరో యువతితో పెళ్లికి రెడీ అవుతున్న ప్రియుడి ఇంటికి వెళ్లింది. అతని ఇంటి ముందే ఆత్మహత్యాయత్నం చేసింది.

వెంటనే స్థానికులు స్పందించి ఆమెను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. మోసగాడిని అరెస్టు చేసి జైలుకి పంపించారు. పెళ్లి పేరుతో తనను నమ్మించి అత్యాచారం చేశాడని యువతి ఫిర్యాదు చేసిందని.. అయితే అతను మరో యువతితో పెళ్లికి సిద్ధమవడంతో ఆత్మహత్య చేసుకుందని రామ్‌రాజ్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ సత్యేంద్ర నగార్ తెలిపారు.