ప్రమాదవశాత్తూ చిన్నారుల మృతి

ఆటలాడుకుంటూనే ఆ చిన్నారులు అనంతలోకాలకు వెళ్లిపోయారు. ఊహించని రూపంలో వచ్చిన మృత్యువు అమాంతం బలితీసుకుంది. కాలుజారి క్వారీ గుంతలో పడి కనిపించకుండా పోయారు. నీటమునిగి ఊపిరాడక ఊపిరి వదిలారు. ఈ అత్యంత విషాద ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. నందిగామ మండలం మేకగూడ గ్రామ శివారులో ఈ ఘటన జరిగింది.

ఊరి శివారులోని క్వారీ గుంత వద్ద ఆడుకోవడానికి వెళ్లిన ఇద్దరు బాలురు గణేష్(13), నందీశ్వర్(8) ప్రమాదవశాత్తూ నీటి గుంతలో పడిపోయారు. కాలు జారి క్వారీ గుంతలో పడి నీటమునిగి ప్రాణాలు కోల్పోయారు. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు.

మృతులను గుర్తించేందుకు చుట్టుపక్కల ఆరా తీశారు. మృతి చెందిన చిన్నారుల్లో ఒకరిది మేకగూడ కాగా, మరొకరిది పక్కనే ఉన్న సంగిగూడగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.