ప్రాణం తీసిన పొగమంచు

పశ్చిమ్ బెంగాల్‌లో పొగమంచు 13 మంది ప్రాణాలను బలితీసుకుంది. మరో 18 మంది గాయపడ్డారు. ఈ దుర్ఘటన జల్‌పాయ్‌గురి జిల్లా ధూప్‌గురి వద్ద మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చోటుచేసకుంది. పొగమంచు కారణంగా రహదారి కనిపించకపోవడంతో ఎదురుగా వస్తున్న ఆటో, కారును రాళ్ల లోడుతో వెళ్తోన్న లారీ ఢీకొట్టింది. దీంతో ఆటో, కారులోని వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 13 మంది చనిపోగా.. మరో 18 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం ధూప్‌గురి ఆస్పత్రికి తరలించారు. పొగమంచు వల్లే ప్రమాదం జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. పొగమంచు కమ్మేయడంతో ఎదురుగా వస్తున్న వాహనాన్ని గుర్తించలేకపోయిన లారీ డ్రైవర్.. కారు, ఆటోను ఢీకొట్టినట్టు తెలిపారు. ఢీకొట్టిన తర్వాత లారీ బోల్తాపడి, అందులోని బండరాళ్లు కారు, ఆటోలపై పడినట్టు స్థానికులు తెలిపారు. జేసీబీ సాయంతో వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.