సహజంగా మాయ మాటలు చెప్పి అమ్మాయిలను మోసగించే అబ్బాయిల గురించి కథలు కథలుగా వింటుంటాం. ఇలాంటి మోసాలు కూడా ఉంటాయా? ఇలా కూడా మోసపోతారా? అని అప్పుడప్పుడు ఆశ్చర్యపోతుంటాం. అయితే హైదరాబాద్‌లో ఉంటున్న అర్జున్ అనే యువకుడి విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయింది. ఓ అమ్మాయి మాటలు నమ్మి ఆరు నెలల్లో అక్షరాలా రూ.14 లక్షలు సమర్పించుకున్నాడు. తాను మోసపోయానని గ్రహించే లోపే జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది.పెళ్లి చేసుకుందామని నమ్మించి, పెళ్లికి రెండు రోజుల ముందు సెల్ స్విచ్ఛాప్ చేసి ఉండడంతో తాను మోసపోయానని ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. సైబర్ క్రైం పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.హైదరాబాద్ నగరంలోని పద్మారావునగర్‌లో అర్జున్ నివాసం ఉంటాడు. ఆరోగ్య రక్షణ, చిట్కాలపై అతను వీడియోలు తయారు చేస్తూ సోషల్ మీడియాలో రెండేళ్లుగా పోస్టు చేస్తున్నాడు. ఈ క్రమంలో గత ఏడాది ఏప్రిల్‌లో అతనికి ఘట్టమనేని వర్ణనా మల్లికార్జున్ అనే పేరుతో ఓ యువతి పరిచయం అయింది. ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్‌తో స్నేహాన్ని పెంచుకున్నారు. వాట్సాప్, ఫోన్‌లలో తరచూ మాట్లాడుకునే వాళ్లు. దీంతో వాళ్లిద్దరి మధ్య సాన్నిహిత్యం బలపడింది. తన తండ్రి మల్లికార్జున, తల్లి నిర్మల శాస్త్రవేత్తలని, తనకు ఏడేళ్ల వయసున్నప్పుడే ప్రమాదంలో చనిపోయారని చెప్పింది. సోదరి, సోదరుడు కలిసి తనను చదివించారని చెప్పింది. కేరళలోని ఎర్నాకుళంలో దంతవైద్యం పూర్తి చేశానని, ప్రస్తుతం విజయవాడలో ఉంటున్నట్టు తీయని మాటలు చెప్పింది. పరస్పరం వ్యక్తిగత విషయాలు పంచుకున్నారు. అభ్యంతరం లేకపోతే పెళ్లిచేసుకుందామంటూ ఫోన్‌లో ఆమె ప్రతిపాదించింది. దీంతో అర్జున్ ఆనందానికి ఆకాశమే హద్దు అయింది. పెళ్లికి అంగీకరించాడు.ఆ తర్వాత అసలు సినిమా చూపించింది. తన సోదరుడికి గతేడాది మే నెలలో ల్యాప్‌టాప్ కావాలని అర్జున్‌ను కోరింది. సునీత్ అనే వ్యక్తిని పంపడంతో ల్యాప్‌టాప్ కొనిచ్చాడు. అలాగే సెప్టెంబరులో ఆమె ఫోన్ చేసి తన తమ్ముడు కరోనా బారిన పడ్డాడని, కొన్ని ఆరోగ్య సమస్యలున్నాయని, హైదరాబాద్ పంపుతున్నట్లు చెప్పింది. సునీత్‌ను అర్జున్ కొండాపూర్‌లోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లి ట్రీట్‌మెంట్ ఇప్పించారు. వైద్యానికి అక్షరాలా రూ.4.60లక్షల బిల్లు చెల్లించాడు. అలాగే ప్రియురాలి కోసం రూ.1.40లక్షల విలువైన హారాన్ని ఇచ్చాడు. నవంబరులో పెళ్లి చేసుకుందామని, ఖర్చులకు డబ్బుకావాలని వర్ణన అడిగింది. 25 రోజుల్లో రూ.8 లక్షల నగదు, బంగారు ఉంగరాన్ని ఆమెకు పంపించాడు. పెళ్లికి కేవలం రెండు రోజులు ఉండగా … ఆమెతోపాటు సునీత్ ఫోన్లు పనిచేయలేదు. దీంతో తాను మోసపోయానని అర్జున్ గ్రహించాడు.దీంతో అతను సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. తన ఆరోగ్యసూత్రాలు ఎంతగానో నచ్చాయని.. లక్షల మందికి ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కలిగిందంటూ యువతి తనతో పరిచయం చేసుకున్నట్టు పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. మనం పెళ్లి చేసుకుని, మరింత మందికి మేలుచేద్దామంటూ నమ్మబలికి చివరికి వంచించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆరునెలల్లో రూ.14 లక్షలు ప్రియురాలికి సమర్పించుకున్నట్టు ఆ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఇన్‌స్పెక్టర్ బి.రమేష్ తెలిపాడు.
